ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాల్లో మాట్లాడారు. ప్రాణాపాయ స్థితిలో కూడా అసాధారణమైన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తిని ప్రదర్శించి విమానంలోని వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడినందుకు స్మిత్‌ను ప్రధాని అభినందించారు. ఈ సంభాషణ సందర్భంగా స్మిత్ తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ, ప్రధానితో మాట్లాడటం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన క్షణమని, మోదీయే తనకు అతిపెద్ద ఆదర్శమని తెలిపారు.
విమానంలో అత్యంత భయాందోళనకరమైన పరిస్థితులు ఎదురైన సమయంలో తనకు ‘హనుమాన్ చాలీసా’ ధైర్యాన్ని ఇచ్చిందని, క్లిష్ట సమయంలో తాను దానినే పఠించానని స్మిత్ ప్రధానికి వివరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, స్మిత్ తల్లి గీతా బెన్ ఆయనను భగవద్గీత బోధనలు, విలువల మధ్య పెంచారని కొనియాడారు. “భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కాదు.. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారని దేశం గర్వంగా చెప్పుకోగలదు” అని మోదీ అన్నారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని యావత్ భారత్ ప్రార్థిస్తోందని ఆయన ధైర్యం చెప్పారు. కాగా, దాడిలో గాయపడిన స్మిత్ మచ్చార్‌కు ప్రస్తుతం అబుదాబిలో మెరుగైన వైద్యచికిత్స అందిస్తున్నారు.
