త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు విజయవంతంగా ముగిశాయని జనసేన నేతలు వెల్లడించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో 2024 ఎన్నికల స్ఫూర్తితోనే ఈసారీ బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలిపారు.
కేవలం గెలుపు అవకాశాలనే ప్రామాణికంగా తీసుకుని సీట్ల కేటాయింపు జరిగిందని, కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని, ఇదే పొత్తు 2029 ఎన్నికల్లోనూ కొనసాగుతుందని నేతలు వెల్లడించారు.
