Breaking News

2028 నాటికి పోలీసు ఖాళీలన్నీ భర్తీ: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలోని ఖాళీలన్నింటినీ 2028 నాటికి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉన్న పోలీస్ సంస్మరణ స్థూపం వద్ద నిర్వహించిన “పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం” (పోలీస్ కమెమోరేషన్ డే) పరేడ్‌లో సీఎం పాల్గొని ప్రసంగించారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బంది త్యాగాలు వర్ణనాతీతమని కొనియాడారు.

1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద ఇండో-టిబెటన్ సరిహద్దు భద్రత సమయంలో చైనా దళాల మెరుపు దాడిలో 10 మంది భారతీయ పోలీసులు అమరులయ్యారని, ఆ త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 154 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తెలంగాణ పోలీస్ విభాగానికి చెందిన ఏఎస్‌ఐ దేవ్ సింగ్, కానిస్టేబుళ్లు ఎం. ప్రమోద్ కుమార్, శీలం కమలాకర్, గాజుల సౌమ్యల త్యాగాలను ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా స్మరించుకుని నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *