Breaking News

దసరా వేళ పెను ప్రమాదం..మార్కెట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్

సూర్యాపేట పట్టణంలో దసరా పండుగ వేళ భారీ పేలుడు కలకలం రేపింది. స్థానిక పీఎస్‌ఎస్ఆర్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీసాయి సూపర్ మార్కెట్‌లో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాద ధాటికి సూపర్ మార్కెట్ భవనం తీవ్రంగా ధ్వంసమైంది. గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పేలుడు తీవ్రతకు భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి, భయాందోళనలతో పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఈ దుర్ఘటనలో తమకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని సూపర్ మార్కెట్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సూపర్ మార్కెట్‌లో పేలుడు సంభవించిన సమయంలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారికంగా సమాచారం రాలేదని, పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *