పనులు పూర్తయ్యాక చౌరస్తా మధ్యలోనే తిరిగి ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు హామీ
ఎల్లారెడ్డి, అక్టోబర్ 10 (E6tv News): పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా శనివారం అంబేద్కర్ చౌరస్తాలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు జాగ్రత్తగా తరలించారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన అనంతరం విగ్రహాన్ని తిరిగి చౌరస్తా మధ్యలోనే ఏర్పాటు చేయాలని అంబేద్కర్ సంఘం సభ్యులు గతంలో మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అప్పటివరకు విగ్రహాన్ని మున్సిపల్ కార్యాలయంలో భద్రపరచాలని కోరారు.
ఈ అంశంపై స్పందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి చౌరస్తా మధ్యలోనే ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో సంఘం నాయకులు, అధికారులు దగ్గరుండి విగ్రహాన్ని తరలించే ప్రక్రియను పర్యవేక్షించారు. విగ్రహానికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తరలింపు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు మ్యాతరి అమృతరావు, కానిరామ్, కుశలకంటి సాయిలు, మొగులయ్య, బిట్ల సురేందర్, గౌతమ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
