నాగిరెడ్డిపేట (e6tv news): నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం పల్లెబోగుడా తండాలో అటవీ భూమి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ భూమిని చదును చేసేందుకు ఉపయోగించారనే ఆరోపణలతో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీ అధికారులను తండావాసులు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డి అటవీ రేంజ్ అధికారి రమేష్ ఆధ్వర్యంలో అధికారులు తండాకు చేరుకుని ట్రాక్టర్లను స్వాధీనం చేసుకునే యత్నం చేయగా, మహిళలు, స్థానికులు భారీగా గుమిగూడి ట్రాక్టర్ల ముందు బైఠాయించి తీవ్ర వాగ్వాదానికి దిగారు.
ఈ ఘర్షణల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. ట్రాక్టర్ యజమాని వినోద్ తల్లి సంత్యాలి తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో తండాలో కలకలం రేగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను స్థానికులు వెంటనే ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే తండాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ అటవీ అధికారులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అటవీ భూమి వివాదం, అధికారుల చర్యలు, మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనతో పల్లెబోగుడా తండాలో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది.
