మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానా.. సేవిస్తే రూ.5 వేల జరిమానా
ఎల్లారెడ్డి, అక్టోబర్ 11 (E6TV న్యూస్).
మద్యపానం వల్ల కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో మద్యపానాన్ని నియంత్రించేందుకు సోమిర్యాగడి తండా గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమిర్యాగడి తండాలో మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామ పంచాయతీ ప్రత్యేక సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఆదివారం గ్రామ సర్పంచ్ మాలోత్ ప్రియాంక అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ పెద్దలు, పంచాయతీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొని మద్యపానంతో కలుగుతున్న అనర్థాలపై చర్చించారు. గ్రామంలో మద్యం, గుడుంబా విక్రయాలు జరపకూడదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని నిర్ణయించారు.గ్రామంలో మద్యం విక్రయిస్తూ పట్టుబడిన వారికి ఒక్కో క్వార్టర్‌కు రూ.10 వేల జరిమానా, మద్యం సేవిస్తూ లేదా కొనుగోలు చేస్తూ పట్టుబడిన వారికి ఒక్కో క్వార్టర్‌కు రూ.5 వేల జరిమానా విధించాలని తీర్మానించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై సంబంధిత శాఖల ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని నిర్ణయించారు.
అలాగే గ్రామంలోని కిరాణా దుకాణాల్లో నిల్వ ఉన్న మద్యం సీసాలను అక్టోబర్ 15వ తేదీలోగా తొలగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. గ్రామంలో మద్యపానాన్ని నియంత్రించి, కుటుంబాల్లో ప్రశాంతతను నెలకొల్పడంతో పాటు ఆర్థిక ఇబ్బందులను తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని గ్రామస్థులు తెలిపారు.గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్థులు సమర్థిస్తూ, మద్యపాన నిషేధం అమలుకు సహకరించాలని సమావేశంలో పిలుపునిచ్చారు.


