గ్రామ అభివృద్ధి పనుల గుర్తింపుపై మహిళలు, రైతులు, ప్రజలకు అవగాహన
భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిది)
భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ (VGPP) తయారీ కోసం మహిళలు, రైతులు, గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా గ్రామంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులను గుర్తించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. అక్టోబర్ 2న నిర్వహించనున్న గ్రామసభలో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రతిపాదించాలని కోరారు. కూలీలకు ఉపాధి కల్పించే పనులతో పాటు గ్రామ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను కూడా గుర్తించి గ్రామసభలో ప్రజల సమక్షంలో ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీవో తెలిపారు. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఫామ్ పాండ్లు, చిన్న నీటి కుంటలు, కమ్యూనిటీ సోక్ పిట్లు, ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని కోరారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో నీటి వనరులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ సమీర్, ఉపసర్పంచ్ గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, ఫీల్డ్ అసిస్టెంట్ మధు, మహిళలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
