విద్యార్థికి టీసీ, బోనఫైడ్ ఇప్పించాలని సబ్ కలెక్టర్‌కు వినతి
బోధన్:, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి).
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న మైనార్టీ విద్యార్థికి టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఇక్రా మోడల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఎత్తోండ రాజేందర్ కోరారు.ఈ మేరకు సోమవారం బోధన్ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి శేక్ తాజ్రీమ్ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలో చదువు కొనసాగించేందుకు టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాన్ని కోరినప్పటికీ స్పందించలేదని రాజేందర్ తెలిపారు.
విద్యార్థి పలుమార్లు టీసీ కోసం అభ్యర్థించినా పాఠశాల యాజమాన్యం దురుసుగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు వాటిని అమలు చేయడం లేదని ఎత్తోండ రాజేందర్ ఆరోపించారు. విద్యార్థి విద్యా సంవత్సరం నష్టపోకుండా అధికారులు తక్షణమే స్పందించాలని ఆయన కోరారు.
