ప్రజాస్వామ్య పరిరక్షణ, SIRకు మద్దతుగా రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర
నిర్మల్, నవంబర్ 3 (E6tv న్యూస్).
నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మహా పాదయాత్రకు భారీ స్పందన లభించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మహా పాదయాత్రను ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, గెడం నాగేష్ తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.పట్టణంలోని శాంతినగర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన పాదయాత్ర ప్రధాన వీధుల మీదుగా సుమారు రెండు కిలోమీటర్ల మేర కొనసాగింది. జిల్లా నలుమూలల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరాగా, ప్రజలు సైతం పాల్గొని మద్దతు తెలిపారు. దీంతో నిర్మల్ పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది.
SIRపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) ద్వారా ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, మరణించిన వారి పేర్లు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లు, నిబంధనలకు విరుద్ధమైన నమోదులను గుర్తించి సరిచేయవచ్చని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అదే సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాల్సిన అవసరం ఉందని వివరించారు.SIR ప్రక్రియపై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న విమర్శలకు సమాధానంగా ప్రజలకు వాస్తవాలను వివరించడంతో పాటు, ఓటర్ల జాబితా ప్రక్షాళనపై అవగాహన కల్పించడమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వృద్ధులకు నెలకు రూ.4 వేల పెన్షన్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు రైతుబంధు, నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం వంటి హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు కొనసాగాలా? ఒకే వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉండాలా? వాటిని నిబంధనల ప్రకారం సరిచేయకూడదా? అంటూ ప్రశ్నించారు. అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా అనర్హమైన, నకిలీ నమోదులను తొలగించడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
ఈ మహా పాదయాత్రలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. SIR ప్రక్రియకు మద్దతుగా నిర్వహించిన ఈ పాదయాత్రతో నిర్మల్‌లో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
