110 విదేశీ, డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం
నిజామాబాద్, అక్టోబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి).
జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నిరంతర తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని న్యాల్‌కల్ రోడ్డు, ముబారక్‌నగర్ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో కంఠాల గంగారత్నం, ముడ భాస్కర్ ఇళ్లలో సోదాలు నిర్వహించి, వారి వద్ద ఉన్న మొత్తం 110 విదేశీ మద్యం, డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులతో పాటు ఇతర మార్గాల ద్వారా తక్కువ ధరకు డిఫెన్స్ మద్యాన్ని కొనుగోలు చేసి, స్థానికంగా అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు ఎం.డి. నజీర్ హుస్సేన్, బి. గజేందర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ వి. రవి, నిజామాబాద్ ఎస్‌హెచ్‌ఓ ఎం. సరితతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

