భద్రాద్రి కొత్తగూడెం (e6tv news): భద్రాచలం గోదావరి తీరం నుంచి అక్రమ ఇసుక రవాణా నిత్యకృత్యంగా మారింది. సిండికేట్‌గా ఏర్పడిన కొంతమంది అక్రమార్కులు అధికారుల ఆశీస్సులతో అర్ధరాత్రి వేళ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ట్రెంచ్‌లను ఇష్టానుసారంగా పూడ్చివేసి, రాత్రి 1 గంట నుండి తెల్లవారుజామున 5:30 గంటల వరకు సుమారు 20 ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ ఒక్కో ట్రాక్టర్‌ను రూ.5000 నుండి రూ.6000 వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ.. రెవిన్యూ, మైనింగ్ మరియు పెట్రోలింగ్ పోలీసులు కనీసం ఫోన్లు కూడా ఎత్తకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు, ముడుపుల మత్తులోనే అధికారులు నిద్ర నటిస్తున్నారని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ మరియు మానవ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు శివ ప్రశాంత్, పూనమ్ ప్రదీప్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు. ట్రాక్టర్ల అతివేగంతో కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం ప్రజలకు అందుబాటు ధరలో (రూ. 1,500 – 2,000) ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

