Breaking News

మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

సమాన పనికి సమాన వేతనం అందించాలి: సాకే హరి

అనంతపురం, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)
మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, సమాన పనికి సమాన వేతనం అందేలా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు.

మంగళవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్షలకు సాకే హరి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 20 ఏళ్లుగా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో భాగంగా స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, కార్డియాలజిస్టులు, కార్డియాక్ సిబ్బంది, ఓపీ టెక్నీషియన్లు తదితర విభాగాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు సేవలందిస్తున్నారని తెలిపారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందించిన ఘనత కాంట్రాక్ట్ ఉద్యోగులకు దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,500 మంది మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలాకాలంగా సేవలందిస్తున్నప్పటికీ వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగులు నెల రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని సాకే హరి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైద్య సేవలను బహిష్కరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉద్యోగ భద్రత, వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జేఏసీ చైర్మన్ దిన్నె శరత్ బాబు, వైస్ చైర్మన్ జి. వెంకట నారాయణ, కన్వీనర్ పి. లావణ్య, ఏపీ జీసీఎన్‌ఏ అధ్యక్షురాలు పి. శ్రీదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్ జి. ప్రశాంతి, పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *