నిజామాబాద్, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)
టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌కు చెందిన డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపు, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై అవగాహన-శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై పలు సూచనలు చేశారు. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సెల్‌ఫోన్ వినియోగించకూడదని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. డ్రైవర్ల అప్రమత్తతే ప్రయాణికుల భద్రతకు ప్రధాన రక్షణ అని పేర్కొన్నారు.
ఇంపాక్ట్ ఫౌండేషన్‌కు చెందిన డా. ప్రవీణ్ కుమార్ డ్రైవర్లకు ఏకాగ్రత, మానసిక ప్రశాంతత, ఆరోగ్య పరిరక్షణ, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా డ్రైవర్లకు ప్రాక్టికల్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రమాదకర పరిస్థితులను ముందుగానే గుర్తించడం, అత్యవసర సమయంలో బ్రేకింగ్‌పై నియంత్రణ, వాహనాన్ని సురక్షితంగా నడపడం, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను వివరించారు.రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ డ్రైవర్లు విధులు నిర్వహిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంతో పాటు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.




