Breaking News

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు

ఎర్గట్లలో ఉత్సాహంగా నిర్వహణ.. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు అవకాశం

ఎర్గట్ల, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి)

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎర్రగట్ల మండల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం మండల స్థాయి క్రీడా పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

ఈ సందర్భంగా డ్రాయింగ్ పోటీ, 100 మీటర్ల పరుగు పందెం, స్పూన్ అండ్ మార్బుల్, మ్యూజికల్ చైర్స్, బ్రిక్స్ తదితర క్రీడలు, వినోదాత్మక పోటీలను నిర్వహించారు. గెలుపోటముల కంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, సమానత్వ భావనను పెంపొందించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రత్యేక అవసరాలు ఉన్నప్పటికీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎర్రగట్ల ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎస్సై రాజేశ్వరరావు, మండల కాంప్లెక్స్ హెచ్‌ఎం కోమరగిరి కృష్ణాచారి తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.భవిత పాఠశాలకు వచ్చే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఏకరూప దుస్తులను స్పాన్సర్ చేసిన గోడిసెల ప్రశాంతికి ప్రత్యేక ఉపాధ్యాయులు బి. ఉదయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులను రేపు నిర్వహించనున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలకు తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *