Breaking News

ఇండియా కూటమి ఆధ్వర్యంలో అక్టోబర్ 7న భారీ నిరసన ర్యాలీ

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: కాట్‌పల్లి నగేష్ రెడ్డి

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని అఖిలపక్షాల డిమాండ్

ఓటు హక్కు పరిరక్షణ కోసం మండల కేంద్రాల్లో ధర్నాలు

నిజామాబాద్, అక్టోబర్ 3:(E6tv NEWS: శివ ఠాకూర్).

ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇండియా కూటమి మిత్రపక్షాల ఆధ్వర్యంలో అక్టోబర్ 7న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన అఖిలపక్షాల నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా సాగుతోందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని అఖిలపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆయనను తొలగించే వరకు కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలు వారం రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాయని చెప్పారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో రాష్ట్రంలో లక్షలాది మంది ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలు కృషి చేస్తాయని తెలిపారు. బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి ఓటర్ల జాబితా సవరణ జరుగుతుందని, అయితే ప్రస్తుత ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అనేక అనుమానాలు ఉన్నాయని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ కారణంగానే మమతా బెనర్జీ ఓడిపోయారని పేర్కొంటూ, ఇదే విధానాన్ని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

మండల కేంద్రాల్లో ధర్నాలు

జాతీయ ఇండియా కూటమి పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం, మంగళవారం మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 7, బుధవారం రోజున జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, సీపీఐ (ఎంఎల్) నేత వనమాల కృష్ణ, ఆర్‌ఎస్‌పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ (ఎంఎల్) నగర కార్యదర్శి సుధాకర్, సయ్యద్ ఫెరోజ్ అలీ, రఘురామ్, పిట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *