రైతులకు న్యాయం చేయాలి.. ప్రాజెక్టుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి
23 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం.. బాధిత రైతులకు పరిహారం కల్పించాలని విజ్ఞప్తి
అమరావతి, అక్టోబర్ 13:(E6tv NEWS).
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం జిల్లేడుబండ రిజర్వాయర్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కీలక చొరవ తీసుకున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సచివాలయంలో చర్చించి, బాధిత రైతుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కూడా చర్చల్లో పాల్గొనాలని సీఎం ఆదేశించడంతో ప్రాజెక్టు భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం, రైతులకు న్యాయం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
గ్రామసభలు నిర్వహించకుండానే భూసేకరణ చేశారనే ఆరోపణలు
ముదిగుబ్బ మండలంలోని పాడరాళ్లపల్లి, జిల్లేడుబండ రిజర్వాయర్ పరిసర ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామస్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, గ్రామసభలు నిర్వహించకుండానే ప్రాజెక్టు పనులు ప్రారంభించారని, భూసేకరణ, పరిహారం, పునరావాసం వంటి అంశాల్లో రైతులకు తగిన న్యాయం జరగలేదని వివరించారు. ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో భూములు కోల్పోయిన రైతులు సాగు, భూముల హక్కులకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం అవసరం
జిల్లేడుబండ రిజర్వాయర్ను యథాతథంగా కొనసాగించాలా? అవసరమైన మార్పులతో ముందుకు తీసుకెళ్లాలా? అనే అంశాలపై సాంకేతికంగా, సమగ్రంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రాజెక్టు ద్వారా అందాల్సిన సాగునీటి ప్రయోజనాలు వృథా కాకుండా చూడటంతో పాటు, భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ప్రాజెక్టు పూర్తయితే సుమారు 23 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నందున, నీటి నిల్వ సామర్థ్యం, భూముల ముంపు ప్రభావం, ప్రాజెక్టు రూపకల్పన తదితర అంశాలను పునఃపరిశీలించాలని కోరారు. బాధిత రైతులందరినీ గుర్తించి, ప్రస్తుత భూముల విలువలు, వర్తించే నిబంధనల ప్రకారం న్యాయబద్ధమైన పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే పునరావాస చర్యలు కూడా చేపట్టాలని సూచించారు.
నిమ్మల రామానాయుడుతో చర్చలు.. త్వరలో చర్యలు
ఈ సమస్యపై గతంలోనూ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సత్యకుమార్ యాదవ్ పలుమార్లు చర్చించారు. ప్రాజెక్టు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు కలిగిన నష్టం, నిర్మాణ పనుల పురోగతి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ చీఫ్ (ENC), చీఫ్ ఇంజినీర్ (CE) స్థాయి అధికారులతో పరిశీలన జరిపించే అంశం చర్చకు వచ్చింది.తాజాగా ముఖ్యమంత్రి సమక్షంలో మరోసారి ఈ సమస్యపై చర్చ జరగడంతో పరిష్కార దిశగా చర్యలు వేగవంతమయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు, భూసేకరణ, పరిహారం, సాగునీటి ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.
2.41 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం
హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పరిధిలో జిల్లేడుబండ రిజర్వాయర్ను సుమారు 2.41 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రతిపాదించారు. దీని ద్వారా సుమారు 23 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి అవసరాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. గతంలో ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.200 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైనప్పటికీ, పనుల పురోగతి, మిగిలిన నిధులు, రైతుల సమస్యలపై స్పష్టత అవసరమైంది.ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు, దాని కారణంగా నష్టపోయిన రైతులకు కూడా న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రైతుల జీవనోపాధిని కాపాడుతూ, ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీటి ప్రయోజనాలు అందేలా జిల్లేడుబండ రిజర్వాయర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
