బాన్సువాడలో ఘనంగా రావణదహనం

కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ, అక్టోబర్ 21 (E6tv న్యూస్).

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన రావణదహన కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వరుసగా 16వ ఏడాది రావణదహన వేడుకలు

మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 16వ సంవత్సరం నిర్వహించిన ఈ రావణదహన కార్యక్రమానికి బాన్సువాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రావణదహనంతో మినీ స్టేడియం పండుగ సందడితో కళకళలాడింది. విజయదశమి వేడుకలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు.

పోచారం గ్రామంలో జమ్మి పూజలు

అనంతరం బాన్సువాడ గ్రామీణ మండలంలోని తన స్వగ్రామమైన పోచారం గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులకు జమ్మి ఆకులను పంపిణీ చేసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమాలతో బాన్సువాడ నియోజకవర్గంలో విజయదశమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, పండుగ వాతావరణంలో కొనసాగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *