Breaking News

దసరా పండుగ రోజునే ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆడపడుచుల ఆవేదన

తమ స్థలానికి రక్షణ కల్పించాలని వేడుకోలు.. న్యాయం జరగకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక

రుద్రూరు, అక్టోబర్ 21 (E6tv న్యూస్).

దసరా పండుగ పూట కూడా తమకు వేధింపులు తప్పడం లేదని, తమ స్థిరాస్తి విషయంలో న్యాయం చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట అక్బర్ నగర్ గ్రామానికి చెందిన మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రాణహాని ఉందని, జీవించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరించడం అక్కడ కలకలం రేపింది.

స్థల వివాదమే ప్రధాన కారణం

బాధితులు కనక మెడల శ్రీలక్ష్మి, కాజా ఝాన్సీతో పాటు కాజా రోహిత్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ స్థిరాస్తికి సంబంధించిన అన్ని పత్రాలు, డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నప్పటికీ, గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సదరు స్థలం తమది కాదంటూ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ స్థలం వద్దకు వచ్చి తవ్వకాలు చేపడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు.దసరా పండుగ రోజున కూడా కొందరు తమ స్థలం వద్దకు వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించారని తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి పత్రాలను పరిశీలించి సంబంధిత వ్యక్తులను అక్కడి నుంచి పంపించారని పేర్కొన్నారు. అయినప్పటికీ తమకు ప్రాణహాని ఉందని, తమ ఆస్తికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ ఎంపీడీవోను కలిసినట్లు వెల్లడించారు.

సర్పంచ్, ఆయన కుమారుడిపై ఆరోపణలు

గ్రామ సర్పంచ్ రాంబాబు, ఆయన కుమారుడు రాజు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. తమకు చెందాల్సిన స్థిరాస్తి దక్కకుండా దౌర్జన్యం చేస్తున్నారని, ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల వివరణ తెలియాల్సి ఉంది.

పంచాయతీ కార్యదర్శి, సిబ్బందిపైనా ఫిర్యాదు

గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది సైతం తమ పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆరోపించారు. అన్ని పత్రాలు ఉన్నప్పటికీ తమ హక్కులను కాలరాస్తున్నారని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ్ముడిపైనా ఆరోపణలు

తమ తమ్ముడు, మాజీ ఉపసర్పంచ్ రంజిత్ తమ ఆస్తి వివాదంలో ఇతరులకు మద్దతుగా నిలుస్తున్నాడని బాధితులు ఆరోపించారు. తమ స్థిరాస్తి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని అతను గతంలో రాసిచ్చిన పత్రం ఉన్నప్పటికీ, ప్రస్తుతం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కూడా సంబంధిత వ్యక్తుల స్పందన తెలియాల్సి ఉంది.

న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాం

గ్రామంలో ప్రశాంతంగా జీవించనివ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని, పండుగ రోజున కూడా మనశ్శాంతి లేకుండా చేశారని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ ఆస్తికి రక్షణ కల్పించి, తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. అవసరమైతే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *