తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో సుదీర్ఘ విరామం తర్వాత కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. 2016 తర్వాత దాదాపు పదేళ్ల విరామం అనంతరం ఈ ఏడాది అక్టోబర్ 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10 కార్మిక సంఘాలు పోటీ పడుతుండగా, సుమారు 39,000 మందికి పైగా ఉద్యోగులు బ్యాలెట్ పేపర్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతుండటం, కేంద్ర లేబర్ కోడ్‌ల అమలు ప్రతిపాదనల నేపథ్యంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం జరిగే చివరి ఐడెంటిటీ కమిటీ ఎన్నికలు ఇవే కావచ్చునని భావిస్తున్నారు.
ఈ ఎన్నికల బరిలో ఎంప్లాయీస్ యూనియన్, ట్రాన్స్‌పోర్ట్ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్‌లు కలసి జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)గా ఏర్పడి 40 అంశాలతో కూడిన డిమాండ్ల చార్టర్‌ను విడుదల చేశాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచడం, 2025 ఏప్రిల్ 1 నుండి వేతన సవరణ అమలుతో పాటు 2017, 2021 బకాయిలు చెల్లించడం, అద్దె బస్సులను తగ్గించి కొత్త సొంత బస్సుల సంఖ్యను పెంచడం వంటి ప్రధాన డిమాండ్లను జేఏసీ తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది. విలీన చర్చల సమయంలో గెలిచిన యూనియనే ఉద్యోగుల ప్రాతినిధ్యం వహించనున్నందున ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
