గణేష్ నిమజ్జన ఊరేగింపులను ప్రశాంత వాతావరణంలో, శాంతిభద్రతల పరిరక్షణతో పూర్తి చేసేందుకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, ఐపీఎస్ బుధవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం 1968 లోని సెక్షన్ 20 కింద తనకు ఉన్న అధికారాలను ఉపయోగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం… సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 6:00 గంటల నుంచి సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు (24 గంటల పాటు) వైన్ షాపులు, కల్లు దుకాణాలు మరియు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు పూర్తిగా మూసివేయబడతాయి. అయితే, స్టార్ హోటళ్లలోని బార్లు మరియు రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు ముగిసేలా సంబంధిత యజమానులు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఫ్యూచర్ సిటీ పోలీసులు ఆదేశించారు.
