ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. పులివెందులకు బయలుదేరిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిలను మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకుని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
పులివెందులలో ఉద్రిక్తతలు తలెత్తవచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అయితే, తమ సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకోవడంపై పోలీసులతో వైసీపీ నేతలు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో కడపలో హైటెన్షన్ నెలకొంది. ఘర్షణలకు ఆస్కారం ఇస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరపడమే లక్ష్యమని పోలీసులు హెచ్చరించారు.
