Breaking News

దసరా జోరు: తెలంగాణలో లిక్కర్ సేల్స్ రికార్డు!

దసరా పండుగ వేళ తెలంగాణలో మద్యం ఏరులై పారింది. మందుబాబుల జోరుతో ఎక్సైజ్ ఖజానా లక్ష్మీకటాక్షంతో కళకళలాడింది. కేవలం పండుగ ముందున్న నాలుగు పనిదినాల్లోనే ఏకంగా రూ.755.14 కోట్ల విలువైన మద్యాన్ని గుటకలేయడం గమనార్హం! గతేడాది లెక్కలను సైతం తుడిచిపెట్టేస్తూ నమోదైన ఈ విక్రయాల్లో ముఖ్యంగా పండుగ ముందురోజు (అక్టోబర్ 19న) ఒక్కరోజే రూ.303.40 కోట్ల సేల్స్ జరిగి సరికొత్త రికార్డు నమోదైంది. అక్టోబర్ 14, 16, 17 తేదీల్లో కూడా వందల కోట్ల మేర అమ్మకాలు జోరుగా సాగాయి.

ఎప్పటిలాగే ఈ దసరా పండుగ సంబరాల్లో బీర్లదే పైచేయిగా నిలిచింది. ఈ నాలుగు రోజుల్లో 10.44 లక్షల కేసుల బీర్లు, 6.83 లక్షల కేసుల హార్డ్ లిక్కర్ ఖాళీ అయిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 డిపోల ద్వారా వైన్‌షాపులు, బార్లు, పబ్బులకు నిరంతరం సరఫరా జరగడంతో ఈ నెల 19 నాటికే మొత్తం అమ్మకాల మార్జిన్ రూ.2,055 కోట్లకు చేరింది. పండుగ హడావుడి ముగిసే సరికి ఈ ఆదాయపు రికార్డులు మరెంత ఎత్తుకు చేరుకుంటాయోనని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *