Breaking News

జాతీయ స్థాయి వుషూలో ఇందూరు పేరు నిలబెట్టాలి

క్రీడాకారులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పిలుపు

ఇందూరు, నవంబర్ 25: (E6tv NEWS).

రాష్ట్రస్థాయి వుషూ క్రీడల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు జాతీయస్థాయిలోనూ పతకాలు సాధించి ఇందూరు ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.

బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థాయి వుషూ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందూరులో క్రీడాకారులకు సరైన సౌకర్యాలు లేకపోయినా ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమన్నారు. క్రీడా మైదానాల అభివృద్ధి కోసం తాను పలుమార్లు ప్రభుత్వానికి వినతులు అందించినట్లు తెలిపారు.ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఏదో ఒక క్రీడలో శిక్షణ పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా, అస్మిత వంటి క్రీడా కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి క్రీడా కోటా ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అనంతరం రాష్ట్రస్థాయి అండర్-14 బాలుర వుషూ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన శ్రీకర్, షేక్ మోవియాలను ఎమ్మెల్యే సన్మానించారు. కాంస్య పతకాలు సాధించిన షేక్ షకిఫ్, అనిరుద్‌తో పాటు రజత పతకాలు సాధించిన అమోఘ్, సంకల్ప్, సాయి కీర్తన్, వర్షిత్‌లను అభినందించి సత్కరించారు.ఈ కార్యక్రమంలో వుషూ కోచ్‌లు అబ్దుల్ ఒమర్, ఎం.డి. ఇర్షాద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *