మరోసారి రీ సర్వే నిర్వహించి అదనపు కరువు మండలాల జాబితా ప్రకటించాలి: కల్వకుంట్ల కవిత
నిజామాబాద్, నవంబర్ 25: (E6tv NEWS).
నిజామాబాద్ జిల్లాలో 18 కరువు మండలాలను గుర్తించిన ప్రభుత్వం, ఆయా మండలాలకు ఎలాంటి సాయం అందిస్తుందో స్పష్టత ఇవ్వడం లేదని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జిల్లాలోని 18 మండలాల్లోనే కాకుండా మిగతా మండలాల్లో కూడా తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం మరోసారి రీ సర్వే నిర్వహించి, కరువు పరిస్థితులను సమగ్రంగా అంచనా వేయాలని కోరారు. అవసరమైతే అదనపు కరువు మండలాల జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులకు సరైన సాగు ప్రణాళిక అందించాలని అన్నారు. ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ, ఏ పంటలు వేయాలో స్పష్టంగా చెప్పడం లేదని విమర్శించారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తే వాటిని ఏ ధరకు కొనుగోలు చేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి 16వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు వచ్చేలా కృషి చేయాలని కవిత సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు పాదయాత్రలు చేస్తుంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు సమావేశాలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు స్పష్టమైన సాగు ప్రణాళిక, తాగునీటి సౌకర్యాలు, అవసరమైన సహాయక చర్యలు అందించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
