Breaking News

ఎస్.ఐ.ఆర్. అమలులో నిజామాబాద్ జిల్లా పనితీరు భేష్

జిల్లా అధికారులను అభినందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు

అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించొద్దు.. అనర్హుల పేర్లు ఉండొద్దు

2.11 లక్షల ఓట్లు తొలగింపు.. మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశం

నిజామాబాద్, నవంబర్ 26: (E6tv NEWS: శివ ఠాకూర్).

ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్.) ప్రక్రియ అమలులో నిజామాబాద్ జిల్లా పనితీరు భేషుగ్గా ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు ప్రశంసించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో బీఎల్ఓల నుంచి ఈఆర్ఓల వరకు అధికారులు పకడ్బందీగా, పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించారని అభినందించారు.

గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, అదనపు ఏఈఆర్ఓలతో ఎస్.ఐ.ఆర్. అమలుపై అదనపు సీఈఓ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏఎస్‌డీడీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డిలీటెడ్) జాబితా రూపకల్పనలో అనుసరించిన విధానాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా రూపకల్పనకు మరింత గడువు పొడిగించిన నేపథ్యంలో ఏఎస్‌డీడీ జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి జాబితాలో ఉన్న ప్రతి ఓటరును పునఃపరిశీలించాలని ఆదేశించారు. ఎక్కడైనా పొరపాట్లు గుర్తిస్తే వెంటనే సరిచేసుకునే అవకాశం ఉందన్నారు.

అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకూడదని, అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో ఉండకూడదని స్పష్టం చేశారు. తుది ఓటరు జాబితా ప్రకటించిన తర్వాత అర్హులైన ఓటర్ల నుంచి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆబ్సెంట్, షిఫ్టెడ్ కేసులను నిశితంగా పరిశీలించాలని అన్నారు.ఏఎస్‌డీడీ జాబితా తయారీలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, ఏఎస్‌డీడీ జాబితాపై బీఎల్ఏల సంతకాలు తీసుకోవాలని సూచించారు.

ఒక వ్యక్తికి ఒకే చోట ఒక ఓటు ఉండాలనే లక్ష్యంతోనే ఎన్నికల సంఘం ఎస్.ఐ.ఆర్. ప్రక్రియ చేపట్టిందని అదనపు సీఈఓ తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉండటం నేరమని, అలాంటి వారు శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ ఓట్ల తొలగింపు చేపట్టగా, నిజామాబాద్ జిల్లాలో ఏఎస్‌డీడీ జాబితాలో 2.11 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయని వెల్లడించారు. ఈ జాబితాలో అర్హులైన ఓటర్లు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని నిర్ణీత గడువులోగా మరోసారి నిర్ధారించుకోవాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్‌ల పరిశీలన

సమీక్ష అనంతరం అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్లు కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వినాయక్ నగర్‌లోని ప్రశాంతి టవర్స్ పోలింగ్ బూత్‌లను సందర్శించారు. అక్కడ బీఎల్ఓలను కలిసి ఎస్.ఐ.ఆర్. అమలు తీరు, ఏఎస్‌డీడీ జాబితా రూపకల్పనను పరిశీలించారు.పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఓటర్లను పలకరించి, బీఎల్ఓలు ఇళ్లకు వచ్చారా? ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ పి. సురేష్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్, బోధన్, బాన్సువాడ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయకుమారి, రవీందర్, ఏఈఆర్ఓలు, అదనపు ఏఈఆర్ఓలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *