Breaking News

ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగం మనది

రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి పౌరుడికి చేరవేయాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇందూరు, నవంబర్ 26: (E6tv NEWS).

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన రాజ్యాంగమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతీయ సంవిధాన్ ప్రచార దళ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పులాంగ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడమే కాకుండా, దాని విలువలు, స్ఫూర్తిని ప్రతి పౌరుడికి చేరవేయడం ఎంతో ముఖ్యమన్నారు. 2015 నవంబర్ 26 నుంచి రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితంతో అనుబంధం ఉన్న ఐదు ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన వారసత్వానికి తగిన గౌరవం కల్పించారని తెలిపారు.

భారత రాజ్యాంగం దేశానికి దిక్సూచి కాగా, ప్రజాస్వామ్యం దేశానికి ప్రాణవాయువని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *