వారం రోజుల విద్యా వేడుకల విజేతలకు బహుమతుల ప్రదానం
పదవ తరగతి విద్యార్థులకు సాలార్-ఎ-మిల్లత్ మోడల్ పేపర్ల పంపిణీ
విద్యార్థులు కృషి, అంకితభావంతో విద్యను అభ్యసించాలి – ఫైజుల్లా ఖాన్
భైంసా,నవంబర్ 27(E6tv NEWS): ఇస్లామియా మోడల్ హైస్కూల్లో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన విద్యా వేడుకల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో పాటు పదవ తరగతి విద్యార్థులకు సాలార్-ఎ-మిల్లత్ మోడల్ పేపర్లను పంపిణీ చేశారు.ఈ నెల 9 నుంచి 14 నవంబర్ వరకు దేశ ప్రముఖులు శాయర్-ఎ-మష్రిక్ అల్లామా ఇక్బాల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, పండిట్ జవహర్లాల్ నెహ్రూల జయంతి సందర్భంగా పాఠశాలలో వారం రోజుల పాటు విద్యా వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా చిత్రలేఖనం, క్విజ్, నషీద్ గీతాలాపన, వ్యాసరచన, వక్తృత్వం, కవితా పఠనం, నాటకం, చార్ట్ ప్రదర్శన, హమ్ద్, నాత్ తదితర పోటీలను నిర్వహించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి, రెండవ, మూడవ బహుమతులను అందజేశారు.
అనంతరం మజ్లిస్ భైంసా శాఖ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ తరపున గత సంవత్సరం పదవ తరగతిలో మొదటి స్థానం సాధించిన అర్ఫియా మహీన్, రెండవ స్థానం సాధించిన ఐషా ఫర్జీన్లకు నగదు బహుమతులు, మెమెంటోలను అందజేశారు. అలాగే పదవ తరగతి విద్యార్థులకు సాలార్-ఎ-మిల్లత్ మోడల్ పేపర్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ విద్యార్థులు కృషి, అంకితభావం, జిజ్ఞాసతో విద్యను అభ్యసించాలని సూచించారు. విద్య ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో దేశానికి, సమాజానికి సేవ చేసే పౌరులుగా మారాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో భాగంగా తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఆలియా బేగం భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ రూపంలో వినిపించారు.
ఈ కార్యక్రమంలో మజ్లిస్ భైంసా శాఖ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్, పాఠశాల కార్యదర్శి, కరస్పాండెంట్ అబ్దుల్ సలీం, మాజీ కౌన్సిలర్ అబ్దుల్ రఫీక్ అలియాస్ రఫూ, మహ్మద్ నవాజ్, అబ్దుల్ ఖైసర్, సయ్యద్ అస్లం, మహ్మద్ అల్మాస్, పాత్రికేయుడు సయ్యద్ ఉబైద్ సల్మాన్, ఉపాధ్యాయులు షేక్ అమీర్, షేక్ మసూద్, ఎం.ఎ. ఫైసల్, మహిళా ఉపాధ్యాయినులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


