Breaking News

రూ.40 లక్షల ప్రజాధనం.. పిచ్చి మొక్కల పాలైన ప్రజా కళ్యాణ వేదిక!

ప్రజల కోసం నిర్మించిన భవనం నిరుపయోగం.. పట్టించుకునే నాథుడే లేడా?

పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తున్న నిర్లక్ష్యం.. వేదికను వినియోగంలోకి తేవాలని రుద్రూర్ ప్రజల విజ్ఞప్తి

రుద్రూర్, నవంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి)

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడాలనే సదుద్దేశంతో సుమారు రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రజా కళ్యాణ వేదిక నేడు నిరుపయోగంగా మారి పిచ్చి మొక్కలు, ముళ్లపొదల మధ్య దర్శనమిస్తోంది. ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనం ప్రజలకు ఉపయోగపడకపోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని రాజీవ్ నగర్ కాలనీలో రైతు వేదిక, బాలుర ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాల, ఆసుపత్రి సమీపంలో ఈ ప్రజా కళ్యాణ వేదికను నిర్మించారు. 2020-21 ప్రాంతంలో సుమారు రూ.40 లక్షలతో నిర్మించిన ఈ భవనం నేటికీ పూర్తిస్థాయిలో ప్రజల వినియోగంలోకి రాకపోవడం విచారకరం. భవనం చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. బహిర్భూమి, మలమూత్ర విసర్జనలకు కూడా ఆ ప్రాంతం ఉపయోగపడుతున్న పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

అభివృద్ధి ప్రదాత పోచారం.. ప్రజల కోసం నిర్మించిన వేదికకు ఈ దుస్థితా?

బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన నాయకుడిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారు కోరిన పనులకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కృషి చేశారని గుర్తుచేస్తున్నారు. అలాంటి ప్రజా సంక్షేమ లక్ష్యంతో నిర్మించిన కళ్యాణ వేదిక నేడు నిరుపయోగంగా ఉండటం బాధాకరమని అంటున్నారు.ఎన్నికల సమయంలో పలువురు నాయకులు ప్రజాసేవ, ఆర్థిక సహకారం, సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల ముందుకు వస్తున్నప్పటికీ, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వానికే ప్రజలు ప్రాధాన్యత ఇస్తారని పోచారం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సుమారు ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రాజకీయ ప్రస్థానం బాన్సువాడ ప్రజలతో ఉన్న అనుబంధానికి నిదర్శనమని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

ప్రజాధనంతో నిర్మించిన ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత అధికారులదే!

ప్రజల కోసం నిర్మించిన భవనాన్ని ఇలా నిరుపయోగంగా వదిలేయడం సరైన పద్ధతి కాదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భవనానికి అవసరమైన మరమ్మతులు చేపట్టి, పరిసరాల్లోని ముళ్లపొదలు తొలగించి, పరిశుభ్రతతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.ప్రజల కోసం పరితపించే నాయకుడి ఆశయాన్ని నిరాశపరచకుండా, ప్రజాధనంతో నిర్మించిన వేదికను ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, స్థానికులు సమిష్టిగా కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.రూ.40 లక్షలతో నిర్మించిన భవనం పిచ్చి మొక్కలకు నిలయంగా మిగలకూడదు.. ప్రజల అవసరాలు తీర్చే ప్రజా కళ్యాణ వేదికగా మళ్లీ వెలుగులోకి రావాలి! ఇదే రుద్రూర్ ప్రజల ఆకాంక్ష.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *