మాజీ ఎమ్మెల్యే ఆరోపణలకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఘాటు కౌంటర్
రాప్తాడు నియోజకవర్గంలో 53 పంచాయతీల్లో కూటమి విజయం
మా రెబల్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లతో మీ మెజారిటీ సమానం
ఎన్నికల్లో అక్రమాలు జరిగితే పేరూరు పంచాయతీలో ఒక్క ఓటు తేడా ఎలా వస్తుంది?
నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే సునీత అభినందనలు
అనంతపురం, నవంబర్ 27: (E6tv NEWS). రాప్తాడు నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం సరికాదని, వాపుని చూసి బలుపు అనుకోవద్దని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో మొత్తం 96 పంచాయతీలకు గాను కూటమి 53 స్థానాల్లో విజయం సాధించిందని, మరో కొన్ని చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యామని తెలిపారు.
నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు రామగిరి మండలం వెంకటాపురం, అనంతపురంలోని ఎమ్మెల్యే నివాసాలకు చేరుకుని పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. తమకు అవకాశం కల్పించినందుకు నూతన ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యే సునీతను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. ఎన్నికల్లో తాము అక్రమాలకు పాల్పడ్డామని ప్రకాష్ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. నిజంగా అధికార బలంతో అక్రమాలకు పాల్పడి ఉంటే స్వల్ప తేడాతో ఓడిపోయిన మరో 20 పంచాయతీలను కూడా గెలిపించుకునేవారమని స్పష్టం చేశారు. రామగిరి మండలం పేరూరు పంచాయతీలో వైసీపీ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలిచారని, తాము ఫలితాలను తారుమారు చేసేవారమైతే ఆ ఒక్క ఓటును మార్చడం సాధ్యం కాదా అని ప్రశ్నించారు.వైసీపీ అనుకూల ప్రచారంలో ఓట్ల ఆధిక్యాన్ని పెంచి చూపిస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు. 10 ఓట్ల ఆధిక్యాన్ని 200 ఓట్ల భారీ మెజారిటీగా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయన్న విషయం అందరికీ తెలుసన్నారు.
రాప్తాడు పంచాయతీ ఫలితాలను ప్రస్తావిస్తూ.. వైసీపీ అభ్యర్థికి 1,405 ఓట్లు రాగా, ముగ్గురు టీడీపీ మద్దతుదారులకు కలిపి 3,635 ఓట్లు వచ్చాయని వివరించారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లు చీలిపోవడంతో వైసీపీ అభ్యర్థి కేవలం 40 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారని తెలిపారు. ఇదే విధంగా ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం, నాగసముద్రం పంచాయతీల్లో కూడా టీడీపీ రెబల్ అభ్యర్థుల వల్లే వైసీపీ విజయం సాధించిందన్నారు.
రంగంపేటలో 9, గాండ్లపర్తిలో 24, రాప్తాడులో 40, పేరూరులో ఒక్కటి, బసంపల్లిలో 37 ఓట్ల స్వల్ప తేడాతో కూటమి అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. ఈ ఐదు పంచాయతీల్లో వైసీపీకి వచ్చిన మొత్తం మెజారిటీ కేవలం 111 ఓట్లు మాత్రమేనని పేర్కొన్నారు. పులేటిపల్లిలో సమాన ఓట్లు రావడంతో లాటరీ ద్వారా వైసీపీ అభ్యర్థి విజయం సాధించారని వివరించారు.నియోజకవర్గంలోని 96 పంచాయతీల్లో కూటమి 55 శాతం స్థానాలను, 13,252 ఓట్ల ఆధిక్యాన్ని సాధించిందని, వైసీపీ 43 శాతం స్థానాల వద్దే నిలిచిపోయిందని సునీత తెలిపారు. తమ పార్టీ రెబల్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లతో పోలిస్తే వైసీపీ మెజారిటీ కేవలం 831 ఓట్లు మాత్రమే ఎక్కువగా ఉందన్నారు.
పార్టీ గుర్తులపై కాకుండా స్థానికంగా అభ్యర్థుల ఎంపిక, ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా కూడా పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. తమ పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల ఓట్లు చీలిపోయి ఓటమి ఎదురైందని తెలిపారు. ఇందులో ప్రకాష్ రెడ్డి గొప్పతనం ఏమీ లేదని, ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత హితవు పలికారు.


