మామడ మండలం తండ్ర గ్రామ శివారులో రెండున్నర ఎకరాల్లో అక్రమ సాగు
258 గంజాయి మొక్కలు, 5.320 కిలోల ఎండిన గంజాయి ఆకులు పట్టివేత
నిందితుడిని అరెస్ట్ చేసిన మామడ పోలీసులు
నిర్మల్, నవంబర్ 26, (E6tv NEWS): పత్తి పంట మాటున అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని నిర్మల్ జిల్లా మామడ పోలీసులు పట్టుకున్నారు. మామడ మండలం తండ్ర గ్రామ పరిధిలోని ధన్జీనాయక్ తండా శివారులో వ్యవసాయ పొలంలో సాగు చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.28.46 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నవంబర్ 25న ఉదయం మామడ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ధన్జీనాయక్ తండాకు చెందిన కున్సోత్ రవి (43) తన వ్యవసాయ పొలంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు సంబంధిత పొలంలో తనిఖీలు నిర్వహించగా, పత్తి పంటతో పాటు అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.ఈ తనిఖీల్లో 204 పచ్చి గంజాయి మొక్కలు, 54 ఎండిన గంజాయి మొక్కలు, ప్లాస్టిక్ సంచిలో నిల్వ చేసిన 5.320 కిలోల ఎండిన గంజాయి ఆకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 258 గంజాయి మొక్కలతో పాటు ఎండిన గంజాయి ఆకుల విలువ సుమారు రూ.28,46,000 ఉంటుందని అంచనా వేశారు.
అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన వ్యవసాయ భూమిలో పత్తి పంటతో పాటు గంజాయి సాగు చేసినట్లు విచారణలో నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అధికారుల, పంచ సాక్షుల సమక్షంలో స్వాధీనం ప్రక్రియ పూర్తి చేసి, నిందితుడిని ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు.జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సూచనల మేరకు నిర్మల్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో సోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. గోవర్ధన్ రెడ్డి, మామడ ఎస్ఐ యు. మహేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు.ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఆర్ఎస్ఐలు విజయ్, రాకేష్, మహేందర్, ఏఆర్ సిబ్బంది, మామడ పోలీస్ సిబ్బంది, సోన్ సర్కిల్ సిబ్బంది, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు
గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ సాగు, విక్రయం, రవాణా, నిల్వ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని నిర్మల్ పోలీసులు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి సాగు లేదా మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్మల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.



