Breaking News

నిజామాబాద్‌లో దారుణం: యూట్యూబర్ భర్త హరిబాబును నరికి చంపిన భావమరిది..

నిజామాబాద్ నగరంలో పట్టపగలే దారుణ హత్య కలకలం రేపింది. ప్రసిద్ధ యూట్యూబర్ వైష్ణవి భర్త చిట్టారి హరిబాబు (26)ను నిజామాబాద్‌లోని రాజరాజేంద్ర (ఆర్‌ఆర్) చౌరస్తా వద్ద ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కొబ్బరి బొండాల కత్తితో దాడి ప్రత్యక్ష సాక్షులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిబాబుపై ఒక వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఈ దాడిలో మొత్తం ముగ్గురు నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇద్దరు కారులో వేచి చూడగా, ఒక వ్యక్తి నేరుగా వచ్చి దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పాత కక్షలే కారణమా? జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబుకు, మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి (19)తో గతంలో వివాహమైంది. యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన వైష్ణవి నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది. భర్త హరిబాబే ఆమెను గొంతు నులిమి, కత్తితో పొడిచి చంపాడని ఆరోపణలు వచ్చాయి. వైష్ణవి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు హరిబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇటీవలే అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు.

“హత్య చేయడం సంతోషంగా ఉంది” – సంతోష్ సెల్ఫీ వీడియో ప్రకటన హరిబాబు హత్య అనంతరం వైష్ణవి సోదరుడు సంతోష్ ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేయడం సంచలనం సృష్టిస్తోంది.

  • “హరిబాబును నేనే హత్య చేశాను” అని సంతోష్ వీడియోలో స్పష్టం చేశాడు.
  • “మా చెల్లికి జరిగిన అన్యాయం, బాధ ఇంకెవరికీ జరగకూడదు” అంటూ వ్యాఖ్యానించాడు.
  • “హరిబాబును అంతమొందించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది” అని పేర్కొన్నాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు కేసు విచారణను వేగవంతం చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *