అనుమతులు లేని బోర్ల తొలగింపు.. జేసీబీతో అక్రమ నిర్మాణాల తొలగింపు
పటాన్చెరు, నవంబర్ 02 (E6tv న్యూస్).
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నీటి వ్యాపారంపై అధికారులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. అక్రమ నీటి వ్యాపారంపై E6tv న్యూస్లో ప్రచురితమైన కథనానికి స్పందించిన హైడ్రా, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి అక్రమార్కులపై కొరడా ఝళిపించారు.
ఈ మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ మల్లేష్ నేతృత్వంలోని బృందం, రామచంద్రాపురం రెవెన్యూ అధికారులు ఆర్ఐ రంజిత్, వీఆర్వోలు శంకర్, నరసింహతో పాటు కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్సై మురళి, పోలీసు సిబ్బంది కలిసి తెల్లాపూర్ శివారు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు.ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నీటి వ్యాపారం నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన బోర్లను గుర్తించి, జేసీబీ సహాయంతో తొలగించారు. అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ, అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై అధికారులు తీసుకున్న చర్యల పట్ల స్థానిక గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అక్రమ నీటి వ్యాపారంపై స్పందించి చర్యలు చేపట్టిన హైడ్రా, రెవెన్యూ అధికారులతో పాటు వారికి సహకరించిన కొల్లూరు పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అక్రమ నీటి వ్యాపారానికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసి, భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాలు పునరావృతం కాకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
