Breaking News

గచ్చిబౌలిలో పోలీసులపై RMP డాక్టర్ దాడి: కేసు నమోదు

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ అపోలో ఆసుపత్రి సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఒక RMP డాక్టర్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. 112 ఎమర్జెన్సీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ శివకుమార్‌తో నిందితుడు వాగ్వాదానికి దిగి, భౌతిక దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుపుతున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ శివకుమార్‌తో సదరు వ్యక్తి మాటామాటా పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన ఆ వ్యక్తి, హెడ్ కానిస్టేబుల్ చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కొని నేలకేసి కొట్టడమే కాకుండా, ఆయన కాలర్ పట్టుకుని ముఖంపై పిడిగుద్దులు గురిచేశాడు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్‌‌కు గాయాలయ్యాయి.

దాడికి పాల్పడిన వ్యక్తిని వరంగల్‌లో ఉషా క్లినిక్ నడుపుతున్న RMP డాక్టర్ సునీల్ కుమార్ (36)గా పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులపై దాడి చేయడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *