హైదరాబాద్‌లోని అమీర్‌పేట ఓయో లాడ్జ్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకొచ్చిన ప్రియుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్రైడ్ లాడ్జ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన బేగరి శిరీష (34), అవుసలపల్లి శ్రీనివాస్ (38)లకు గతంలోనే పరిచయం ఉంది. 2016లోనే విడాకులైన శిరీష నగరంలో కస్టమర్ కేర్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆమెను వివాహం చేసుకుంటానని శ్రీనివాస్ ఏళ్లుగా నమ్మిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 24న గణేశ్, దుర్గ అనే నకిలీ ఆధార్ కార్డులతో లాడ్జ్ గదిని అద్దెకు తీసుకున్నారు. సోమవారం రాత్రి పెళ్లి ప్రస్తావన రావడంతో గొడవ జరిగి, ఆగ్రహంతో శ్రీనివాస్ ఆమెను తీవ్రంగా కొట్టి హత్య చేశాడు.
హత్య అనంతరం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు రిసెప్షన్‌లో బిల్లు చెల్లించిన శ్రీనివాస్, శిరీష ఉదయం ఖాళీ చేస్తుందని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం తలుపులు తీయకపోవడంతో లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, ప్రత్యామ్నాయ తాళంతో తెరిచి చూడగా శిరీష మంచంపై శవమై కనిపించింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు.
