కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పట్ల తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నేలకొందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు ధీమా వ్యక్తం చేశారు. కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ‘రికాల్, రిగ్రెట్, రివోల్ట్’ (తిరస్కరణ, పశ్చాత్తాపం, తిరుగుబాటు) అనే అంశాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతోందన్నారు.
అలాగే, భాజపాతో బిఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్, సిద్ధాంతపరంగా ఆ పార్టీకి తాము పూర్తిగా వ్యతిరేకమని, వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోరాడతామని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ భారత రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, ఈ ప్రతిపాదనను తమ పార్టీ తీవ్రంగా నిరసిస్తోందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మతం పేరిట దేశాన్ని విడదీయాలని చూస్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
