రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ కాంప్లెక్స్ (ఐడీవోసి)ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి విషయాల్లో కేంద్రంతో కలిసి పనిచేస్తామని, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ప్రధాని, కేంద్ర మంత్రులను ఎన్నిసార్లైనా కలుస్తానని తెలిపారు.
కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరపడం వల్లే ఆరు నెలల్లోనే 170 ఎకరాల రక్షణ శాఖ భూముల బదిలీతో పాటు, బేగంపేట విమానాశ్రయం రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని గుర్తుచేశారు. ప్రజలకు, ముఖ్యంగా పేదలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని, కార్యాలయాలకు వచ్చే బాధితులను సొంత కుటుంబసభ్యుల్లా భావించి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
