రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి 12 వేల మందికి పైగా సర్పంచులు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామంలో రోజూ 100 నుంచి 150 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. నీటి సంరక్షణలో భాగంగా “ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట” నినాదంతో ముందుకు సాగాలన్నారు.
సర్పంచులు “వర్క్ ఫ్రమ్ విలేజ్ – వర్క్ ఫర్ విలేజ్” స్ఫూర్తితో గ్రామాల్లోనే ఉంటూ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ రాబోయే 15 రోజుల్లో కొత్త జాబ్ కార్డులు అందజేయాలని అధికారులను స్పష్టంగా ఆదేశించారు. అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యంతో పనులను ఎంపిక చేసి, అన్ని జిల్లాలకు సమాన న్యాయం చేయాలని, అలాగే నవంబర్ 19 కల్లా గ్రామాల్లో పెండింగ్లో ఉన్న భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
