నాణ్యతలో రాజీ వద్దు.. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలి: ప్రత్యేక అధికారి హనుమంతరావు
కందకుర్తి పుష్కర ఘాట్‌ను కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన ప్రత్యేక అధికారి
నిజామాబాద్, అక్టోబర్ 23 (E6tv న్యూస్).
గోదావరి పుష్కరాల సందర్భంగా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, పుష్కరాల ప్రత్యేక అధికారి హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కందకుర్తి పుష్కర ఘాట్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి సందర్శించి, వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా దేవాదాయ, నీటిపారుదల, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ తదితర శాఖల వారీగా చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.పుష్కర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఆలయాల అభివృద్ధి, నవీకరణ, నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం, పాత ఘాట్ల మరమ్మతులు, రహదారుల నిర్మాణం, తాగునీటి వసతి, పార్కింగ్ సౌకర్యాలు, వీఐపీ ఘాట్ నిర్మాణం వంటి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
గత పుష్కరాల సమయంలో ఎదురైన సమస్యలను గుర్తించి, ఈసారి అవి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పుష్కర ఘాట్లకు ఇరువైపులా ర్యాంపులు నిర్మించడంతో పాటు, వాచ్టవర్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మార్చి నెలాఖరులోగా అన్ని పనులు పూర్తి చేస్తాం: కలెక్టర్
ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి, యంచ తదితర గోదావరి పరీవాహక పుణ్యక్షేత్రాల్లో పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. కందకుర్తి పుణ్యక్షేత్రానికి ప్రముఖులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడి పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.కందకుర్తి వద్ద గోదావరిలో ప్రస్తుతం నీటి ప్రవాహం ఉన్నందున కొత్త పుష్కర ఘాట్ నిర్మాణానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. నీటిమట్టం తగ్గిన తర్వాత ఘాట్ నిర్మాణ పనులు చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. మిగిలిన పనులను కూడా మైలురాళ్ల ఆధారంగా వేగంగా పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా అన్ని పనులు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించామని కలెక్టర్ వివరించారు.
ఈ పర్యటనలో బోధన్ ఆర్డీఓ విజయకుమారి, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, నీటిపారుదల, దేవాదాయ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.



