Breaking News

కేక్ కటింగ్‌లకు దూరంగా.. నిరుపేదల జీవితాల్లో పెళ్లి వెలుగులు!

ధర్మపురి సంజయ్ జన్మదినం సందర్భంగా 8 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు

ఇప్పటివరకు 200 మందికి పైగా నిరుపేద జంటలకు వివాహాలు

ఉచిత సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయం: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్, నవంబర్ 21:(E6tv NEWS).

జన్మదిన వేడుకలను ఆర్భాటాలకు పరిమితం చేయకుండా నిరుపేద కుటుంబాల జీవితాల్లో ఆనందం నింపేలా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించడం ఇతర రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

నగరంలో శనివారం మాజీ తొలి మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం భవనంలో ఎనిమిది జంటలకు ఉచిత సామూహిక వివాహాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎనిమిది జంటలకు పుస్తె మట్టెలు అందజేసి సంప్రదాయబద్ధంగా వివాహాలు జరిపించారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ధర్మపురి సంజయ్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా సామూహిక వివాహాలు జరిపించడం గొప్ప విషయమన్నారు. రాజకీయ నాయకులు ప్రజలకు అండగా నిలుస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం సమాజానికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా నిరుపేదలకు వివాహాలు జరిపించడం ఆయనకు సమాజం పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తోందని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ధర్మపురి సంజయ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు.

కులమతాలకు అతీతంగా సంప్రదాయబద్ధంగా వివాహాలు

అనంతరం ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సంప్రదాయాలను గౌరవిస్తూ వివాహాలు జరిపించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఓ మహిళా మాతృమూర్తి ఇచ్చిన సలహాతో ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేద జంటలకు వివాహాలు జరిపించాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నట్లు చెప్పారు.జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్‌లు, ఇతర ఆర్భాటాలకు డబ్బులు ఖర్చు చేయడం కన్నా నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తనకు నిజమైన ఆనందమని పేర్కొన్నారు. మేళతాళాలతో వైభవంగా వివాహాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు సుమారు 200కు పైగా జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించినట్లు గుర్తుచేశారు. నూతన వధూవరులకు పుస్తె మట్టెలతో పాటు పట్టు వస్త్రాలు, వివాహానికి అవసరమైన సామగ్రిని అందజేస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ కూరగాయల ఉమారాణి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, గౌడపు శరత్, బంటు బలరాం, కులచారి చారి వెంకటేష్, అపర్ణ, పుప్పాల విజయ, వేణు రాజ్, సీనియర్ నాయకులు, ధర్మపురి సంజయ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *