ఎప్పుడు కూలిపోతాయో తెలియని ఇళ్లలో భయంభయంగా జీవనం
వర్షాకాలంలో ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరు.. పట్టించుకునేవారు లేరంటూ వృద్ధురాలి ఆవేదన
పత్తి రాము, ఇందూరు చంద్రశేఖర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించాలని బాధితుల విజ్ఞప్తి
రుద్రూర్, నవంబర్ 20:(E6tv NEWS).మాకు న్యాయం చేయండి.. ఎప్పుడు కూలిపోతాయో తెలియని శిథిలావస్థ ఇళ్లలో ఇంకెన్నాళ్లు బతకాలి అంటూ ఓ వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్న పేద కుటుంబాలు ఇళ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోడలు బీటలు వారడంతో పాటు ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని వాపోతున్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. పత్తి రామన్న, ఇందూరు చంద్రశేఖర్ అన్నా.. మాకు న్యాయం చేయండి అంటూ వేడుకుంది. బాన్సువాడ నియోజకవర్గంలో ప్రజల కష్టాలను తీర్చే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారని, ఆయన కూడా తమ సమస్యపై కనికరించి పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.తమ కాలనీలో ఒక్క ఇల్లు మాత్రమే కాకుండా అనేక ఇళ్లు కూలిపోయాయని, మరికొన్ని ఇళ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని బాధితులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లలోకి వర్షపు నీరు చేరి, వర్షపు మడుగుల్లోనే జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏళ్ల తరబడి సమస్య కొనసాగుతున్నప్పటికీ తమకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించాలని కోరుతున్నారు. తమకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కొత్త ఇళ్లు మంజూరు చేసి, సురక్షితమైన నివాసం కల్పించాలని అంబేద్కర్ కాలనీ బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.
ఇప్పటికైనా పాలకులు స్పందిస్తారా? పేదల గోడు విని వారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.
