బాధిత బాలికకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం
పటిష్ట సాక్ష్యాధారాలు.. సమర్థవంతమైన దర్యాప్తుతో నిందితుడికి శిక్ష
పోలీస్ సిబ్బందిని అభినందించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, నవంబర్ 19: (E6tv NEWS: శివ ఠాకూర్),
మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించిన నిందితుడికి నిజామాబాద్ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాధిత బాలికకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా రూ.5 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. ఈ కేసులో పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి, సమర్థవంతంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ అభినందించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక 12 సంవత్సరాల వయస్సులో ఐదో తరగతి చదువుతున్న సమయంలో నిందితుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక భయంతో తల్లిదండ్రులకు విషయం చెప్పలేకపోయింది.2021 అక్టోబర్ 3న బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్య పరీక్షల్లో బాలిక సుమారు ఆరు నెలల గర్భిణిగా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో తల్లి విచారించగా నిందితుడి దారుణం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై బాధితురాలి తల్లి 2021 అక్టోబర్ 15న నిజామాబాద్ టౌన్-1 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు క్రైమ్ నంబర్ 329/2021 కింద ఐపీసీ 376 AB, 506, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.దర్యాప్తులో భాగంగా బాధితురాలి వైద్య నివేదికలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
న్యాయస్థానం సంచలన తీర్పు:
ఈ కేసును విచారించిన నిజామాబాద్ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి దుర్గాప్రసాద్, PSC No.65/2022 కేసులో 2026 నవంబర్ 19న నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్షలు విధించారు.ఐపీసీ సెక్షన్ 376 AB కింద యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా.ఐపీసీ సెక్షన్ 376(2)(n) కింద యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా.ఐపీసీ సెక్షన్ 506 కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా.పోక్సో చట్టంలోని సెక్షన్లు 5(L), 5(J)(ii), 5(M) రెడ్ విత్ సెక్షన్ 6 కింద ప్రతి సెక్షన్‌కు 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా.ఈ శిక్షలన్నింటినీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా బాధిత బాలికకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా రూ.5 లక్షల పరిహారం అందించాలని తీర్పులో పేర్కొంది.
ఈ కేసులో మొదటి నుంచి చివరి వరకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు నిర్వహించారు. కీలకమైన సాక్ష్యాధారాల సేకరణ, సాక్షుల సమన్వయం, వారిని విచారణ సమయంలో న్యాయస్థానానికి హాజరుపరచడం వంటి అంశాల్లో సమర్థవంతంగా వ్యవహరించారు. ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతమైన వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష పడింది.
ఈ సందర్భంగా కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.మైనర్ బాలికలు, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
