దేశానికి సేవ చేసిన శ్రీనివాసులు.. ఇప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చారు
చెన్నేకొత్తపల్లిలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
చెన్నేకొత్తపల్లి, నవంబర్ 24:(E6tvNEWS).
పంచాయతీ ఎన్నికల్లో కులాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలకు మంచి చేసే వ్యక్తులను గెలిపించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు కొందరు కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని, అలాంటి వాటిని పట్టించుకోకుండా గ్రామాభివృద్ధికి కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు ఎమ్మెల్యే పరిటాల సునీత విస్తృతంగా పర్యటించారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాజీ సైనికుడు శ్రీనివాసులుతో పాటు వార్డు సభ్యులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా చిన్నపల్లి గ్రామ రహదారి సమస్య, ఎర్రంపల్లి గ్రామ తాగునీటి సమస్యతో పాటు ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.చెన్నేకొత్తపల్లిలో నిర్వహించిన ప్రచార సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థి ఓటమి చెందడం బాధాకరమని అన్నారు. మనలో మనం విభేదాలు సృష్టించుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు.
గత సర్పంచ్ ఎన్నికల సమయంలో తమ అభ్యర్థి గెలిచినప్పటికీ, అప్పటి పాలకులు అన్యాయంగా వ్యవహరించారని గుర్తుచేశారు. పోలీసు అధికారి బెదిరింపులకు సైతం వెనుకాడకుండా ధైర్యంగా నిలబడిన వ్యక్తి మాజీ సైనికుడు శ్రీనివాసులు అని కొనియాడారు. దేశ సరిహద్దుల్లో సేవలందించిన శ్రీనివాసులు ఇప్పుడు గ్రామ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చారని, అలాంటి వ్యక్తికి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు.కుల రాజకీయాలపై స్పందిస్తూ.. మనమంతా ఒకే తెలుగుదేశం కుటుంబమని, రాజకీయాల్లో కులం కంటే ప్రజలకు సేవ చేసే గుణం ముఖ్యమని అన్నారు. కులం అనేది కుటుంబ వేడుకలు, శుభకార్యాల వరకే పరిమితం కావాలని, రాజకీయాల్లో మంచి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బీసీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని, వాల్మీకి సోదరులు ఏకగ్రీవంగా తమకు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.
పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ఎమ్మెల్యే, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక ఓటర్లను సైతం గ్రామానికి తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులుతో పాటు వార్డు సభ్యులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో చెన్నేకొత్తపల్లి మండల టీడీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


