Breaking News

గ్రామ కమిటీలపై బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం:నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో గ్రామ కమిటీల (వీడీసీ) వ్యవహారశైలిపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తీవ్రంగా స్పందించారు. గ్రామ కమిటీలు తమ పరిధి దాటి ‘సుప్రీం లా’గా వ్యవహరిస్తూ, మాట వినని అమాయకులను గ్రామ బహిష్కరణకు గురిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో ఏకంగా ఒక ఎమ్మెల్యేను సైతం గ్రామ బహిష్కరణకు గురిచేసిన చరిత్ర ఈ కమిటీలకు ఉందని గుర్తుచేశారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బహిష్కరణకు గురైన పలువురు బాధితుల నుంచి ఆయన స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు.

గ్రామ కమిటీలు కేవలం గ్రామాభివృద్ధి, సామాజిక సంక్షేమం కోసమే పనిచేయాలి తప్ప, రాజ్యాంగ విరుద్ధంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని జి. నిరంజన్ స్పష్టం చేశారు. గ్రామ బహిష్కరణలు, జరిమానాలు విధించడం వంటి అనాగరిక చర్యలను కట్టడి చేయకపోతే పాలనా వ్యవస్థ విఫలమైనట్లే అవుతుందని హెచ్చరించారు. ఇటువంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడే వారిపై పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే, గ్రామ బహిష్కరణలు మరియు వేధింపులను అరికట్టేందుకు బాధితులకు రక్షణగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని బీసీ కమిషన్ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పౌర సమాజం పనిచేయవచ్చే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదని నిరంజన్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *