రూ.10.70 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం
వర్ని, అక్టోబర్ 14 (E6tv NEWS: శివ ఠాకూర్)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నూతనంగా నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రూ.10 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రిని బుధవారం ఆయన ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య నాయకుడిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నూతన సామాజిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడంతో వర్ని మండల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని తెలిపారు. స్థానికంగానే మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటంతో వైద్య అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఈ ఆరోగ్య కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మహిళలు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి పండుగ వేడుకల్లో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో వర్ని మండల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



