Breaking News

ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు

దేశ నిర్మాణంలో ఇద్దరు మహానేతల సేవలు చిరస్మరణీయం: బొబ్బిలి రామకృష్ణ

నిజామాబాద్, అక్టోబర్ 31 (E6tv న్యూస్): భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. చిన్నతనం నుంచే దేశభక్తి, నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్న ఆమెను ప్రపంచం ‘భారత ఉక్కు మహిళ’గా గుర్తించిందని పేర్కొన్నారు. 1966లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు.

1969లో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసి సామాన్య ప్రజలకు, రైతులకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేశారని, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత్ సాధించిన విజయం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠను పెంచారని గుర్తుచేశారు. హరిత విప్లవానికి ప్రోత్సాహం అందించి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపించారని తెలిపారు. సంస్థానాధీశుల రాజభరణాల రద్దులోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.1984 అక్టోబర్ 30న భువనేశ్వర్‌లో చేసిన ప్రసంగంలో తన రక్తంలోని ప్రతి బొట్టు దేశాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని ఇందిరాగాంధీ పేర్కొన్నారని గుర్తుచేశారు. మరుసటి రోజే అక్టోబర్ 31న ఆమె హత్యకు గురయ్యారని, దేశ సేవకు, ఆమె త్యాగానికి భారత చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.

అదేవిధంగా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. స్వతంత్ర భారతదేశ తొలి ఉప ప్రధానిగా, తొలి హోంమంత్రిగా పటేల్ అందించిన సేవలు అపారమని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం 560కి పైగా సంస్థానాలను దౌత్యనీతి, దృఢ సంకల్పంతో భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించి సమైక్య భారత నిర్మాణానికి పునాదులు వేశారని పేర్కొన్నారు. హైదరాబాద్, జునాగఢ్ వంటి సంస్థానాల విలీనం ఆయన రాజకీయ చతురతకు, పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు.బార్డోలీ సత్యాగ్రహంలో రైతులకు నాయకత్వం వహించి విజయం సాధించడంతో ప్రజలు ఆయనకు ‘సర్దార్’ అనే బిరుదును అందించారని గుర్తుచేశారు. ఈ ఇద్దరు మహానేతల ఆశయాలు, దేశభక్తి, త్యాగనిరతి నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఏఐసీసీ కోఆర్డినేటర్ గన్ రాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు కౌదపు శరత్, నగర ఉపాధ్యక్షుడు అంతారెడ్డి విజయ్ పాల్ రెడ్డి, జిల్లా ఎస్టీ అధ్యక్షుడు యాదగిరి, బంటు బలరాం, మహిళా నాయకులు పోలా ఉష, చంద్రకళ, విజయలక్ష్మి, అమరాజు, పోలా శంకర్, అదే ప్రవీణ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

– యస్. లక్ష్మణ్ పీఆర్ఓ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, నిజామాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *