ఘన నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
ఇందూరు, అక్టోబర్ 31: (E6tv NEWS: శివ ఠాకూర్).
దేశ సమగ్రత, జాతీయ ఐక్యత కోసం విశేష కృషి చేసిన మహానుభావుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం నగరంలోని వర్ని చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 562 సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహమైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మించి ఆయనకు ఘనమైన నివాళి అర్పించారని తెలిపారు.
అదేవిధంగా నిజాం నిరంకుశ పాలనకు ముగింపు పలికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడంలోనూ పటేల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో ప్రారంభించగా, సెప్టెంబర్ 17న నిజాం లొంగుబాటు ప్రకటించడంతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లుఅర్చనా, చిరంజీవి, జగదీష్ కులకర్ణి, మల్కాయి మహేందర్, మఠం పవన్, న్యాలం సునీత రాజు తదితరులు పాల్గొన్నారు.


