Breaking News

MVSR కాలేజీ దాండియా విషాదం.. ముగ్గురు అరెస్ట్!

రంగారెడ్డి జిల్లా నాదర్‌గూల్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో దాండియా వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న ఘోర ప్రమాదానికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈవెంట్ నిర్వహణలో అజాగ్రత్త, నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై సాకేత్, పునీత్, నిశాంతి యాదవ్‌లను ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. దసరా పండుగ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉత్సాహంగా దాండియా ఆడుతుండగా, వేడుకల కోసం ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ పోల్ ఒక్కసారిగా విద్యార్థులపై కూలిపోయింది. ఈ ఘటనలో వనపర్తికి చెందిన బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని సోనా నారాయణదాస్ (18) తీవ్ర గాయాలతో మృతి చెందగా, మరో 22 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధారించారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన, గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *