ముంబై: ఐఐటీ బాంబే (IIT-Bombay) క్యాంపస్‌లో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల దళిత విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి మృతిపై క్యాంపస్‌లో మూడో రోజూ నిరసనలు, ఆందోళనలు మిన్నంటడంతో ఐఐటీ బాంబే యాజమాన్యం ఎట్టకేలకు దిగివచ్చింది. విద్యార్థి ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను డీన్ పదవి నుంచి సోమవారం తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ కేదారే విద్యార్థులకు ఇమెయిల్ ద్వారా సమాచారం అందించారు. ప్రొఫెసర్ సూర్యనారాయణపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో పేరు ఉండటంతో పాటు, తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఆయనను డీన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆయనను కేవలం అడ్మినిస్ట్రేటివ్ డీన్ పదవి నుంచే కాకుండా ప్రొఫెసర్‌గా పూర్తిస్థాయిలో సస్పెండ్ చేయాలని ఆందోళన బాట పట్టిన విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కులం పేరుతో వేధింపులు.. తీవ్ర ఆరోపణలు:
సాహిల్ తల్లిదండ్రులు ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రొఫెసర్ సూర్యనారాయణపై కేసు నమోదైంది. పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్‌గా ఉన్న సూర్యనారాయణ, తమ కుమారుడిని కులం పేరుతో తీవ్రంగా వేధించాడని, ఆ వివక్ష తట్టుకోలేకే సాహిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపించారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డైరెక్టర్‌కు అందజేశారు. ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు విద్యార్థుల డిమాండ్లన్నింటినీ నెరవేరుస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.
విద్యార్థిపై నిందలు పడేశారని ఆగ్రహం – క్షమాపణ చెప్పిన ఐఐటీ బాంబే:
ఘటన జరిగిన తొలి రోజుల్లో సాహిల్ పరీక్షలో ‘ఏఐ’ (AI) ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తూ దొరికిపోయాడని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని ఐఐటీ బాంబే యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై విద్యార్థులు తీవ్రంగా మండిపడ్డారు. తప్పు చేశాడో లేదో తేలకముందే, తనను తాను సమర్థించుకోవడానికి కూడా లేని ఒక మరణించిన విద్యార్థిపై ఇలాంటి నిందలు వేయడం తీవ్రమైన మాననష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల నిరసనకు దిగివచ్చిన ఐఐటీ బాంబే యాజమాన్యం సోమవారం అధికారికంగా క్షమాపణలు కోరింది. విచారణ పూర్తవకుండా ముందస్తుగా అలా మాట్లాడటం సరైనది కాదని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వివరణ ఇస్తూ తమ తప్పును అంగీకరించింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

