న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా తమ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం వెనక్కి తీసుకున్నారు. ప్రత్యామ్నాయ న్యాయపరమైన మార్గాలు అందుబాటులో ఉండగా నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ధర్మాసనం ప్రశ్నించడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన కేసులో అరెస్టయిన సౌరవ్ దాస్ (27), అశుతోష్ రంకా (32) జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అక్టోబర్ 19న మరో రెండు రోజులు పొడిగించగా, ఆ ఉత్తర్వులను వారు హైకోర్టులో సవాలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్ల వయసు గురించి వారి తరఫు న్యాయవాది తెలపగా.. ‘అయితే మీరు జెన్ జీ కాదు’ అని వ్యాఖ్యానించారు. రివిజన్ పిటిషన్ వేసే అవకాశం ఉండగా, ఆర్టికల్ 226 కింద నేరుగా హైకోర్టును ఆశ్రయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకుని మేజిస్ట్రేట్ కోర్టులో తగిన మార్గాన్ని అనుసరించడం మంచిదని ధర్మాసనం సూచించింది. హైకోర్టు సూచన మేరకు పిటిషనర్లు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడంతో కోర్టు దానిని పరిష్కరించింది.
